రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, విద్యా, వ్యవసాయానికి సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేస్తూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా కొనియాడారు. సోమవారం కడప నగరంలోని మార్కెట్ యార్డ్ లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కమలాపురం ఎమ్మెల్యే. పి. రవీంద్రనాథ్ రెడ్డి , మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు గంగ దేవి, బంగారు నాగయ్య యాదవ్, పార్టీ నాయకులు ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంజాద్‌బాషా, రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చి వాటిని సమర్థంగా అమలు చేస్తున్న ఘనత సీఎంకే దక్కుతుందని కొనియాడారు. అర్హులకు సంక్షేమ పథకాలను ఇంటి వద్దే అందిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని దోచుకుతినడం తప్ప... ప్రజల సంక్షేమం కోసం కనీసం ఆలోచన చేయలేదని, ఎన్నికలు వచ్చేసరికి ఆ పార్టీ నాయకులు మళ్లీ ప్రజలను దోపిడీ చేసేందుకు ఓట్లు అడగేందుకు వస్తుండడం సిగ్గుచేటని అన్నారు. 14 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ పాలకులు ప్రజలకు ఒక్క మంచిపనైనా చేశారా అని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను లూటీచేశారన్నారు. ఓట్లు అడిగేందుకు గ్రామాల్లోకి వచ్చే టీడీపీ నేతలను వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ పథకాలు ఎందుకు మీ ప్రభుత్వంలో ఇవ్వలేదని నిలదీయాలన్నారు. ఎల్లోమీడియా ప్రజలను తప్పుదారిపట్టించేలా వార్తలు వడ్డిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని, ఒక్కో సచివాలయంలో ఉద్యోగులు, వలంటీర్లు, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు ఇలా కనీసం 30 మంది వరకు ప్రజలకు సేవ చేసేందుకు నియమించారన్నారు. నిరంతరం ప్రజలకు సేవ చేసుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని కోరారు.