వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులై, వారు వైయస్ఆర్‌సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 200 మంది కార్యకర్తలు వైయస్ఆర్‌సీపీలో చేరారు. వీరిలో 15 కుల సంఘాల వారు, మహిళలు అధిక సంఖ్యలో చేరగా, వీరికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా తూర్పువిప్పర్రు గ్రామంలో శెట్టిబలిజ రామాలయం వద్ద ఉన్న శెట్టిబలిజ నాయకుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ కులంలో మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఘన విజయానికి కార్యకర్తలు సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల విలువైన వైద్యం అందేలా మార్పులు చేస్తూ అందించిన ఆరోగ్యశ్రీ కార్డులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.