ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడిలో టీడీపీ, జనసేన పార్టీలకు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పాలనకు, దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులైన సుమారు 200 మంది టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ బాణాసంచాతో ఘనస్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చేరికల కార్యక్రమానికి ముందు కూచింపూడి మెయిన్ రోడ్డు నుంచి వైయస్ఆర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాతా రమ్య, పెదవేగి సొసైటీ చైర్మన్ పెనుమాక వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.