కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలోనే తీపికబురు అందనుంది. డియర్‌నెస్ అలవెన్స్ డీఏ (కరువు భత్యం), డియర్‌నెస్ రిలీఫ్- డీఆర్ పై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటన చేయనుంది. సాధారణంగా డీఏ సవరణలు జనవరి, జులైలో చేపడుతుంది కేంద్రం. అయితే, ప్రతిసారీ ఇది మార్చి, సెప్టెంబర్ లో ప్రకటన చేస్తోంది కేంద్రం. అయితే, అమలు చేసేది మాత్రం జనవరి, జులై నుంచే కావడం ఊరట కలిగించే విషయమే. బకాయిల్సి కుడా చెల్లిస్తోంది. అయితే, ఈసారి డీఏ 4 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని నిపుణులు అంచనే వేస్తున్నారు. మార్చి నెలలో అంటే మరో 15-20 రోజుల్లోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో డీఏ, డీఆర్ 4 శాతం పెరిగితే శాలరీ, పెన్షన్ ఎంత పెరుగుతుంది? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
డీఏ పెంపు అనేది కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ సీపీఐ-ఐడబ్ల్యూ ఆధారంగా నిర్ణయిస్తారు. దీనికి ఓ ఫార్ములా ఉంది. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం డీఏ 46 శాతానికి చేరింది. 7వ వేతన సంగం ప్రకారం డీఏ అనేది ((గత 12 నెలల AICPI-IW సగటు- 261.42 )/261.42x100) సూత్రం ద్వారా లెక్కిస్తారు. సీపీఐ డేటాను లేబర్ బ్యూరో ప్రకటిస్తుంటుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం.. DA%= (392.83-261.42)/261.42x100= 50.26 గా అవుతుంది. దీన ప్రకారం చూసుకుంటే డీఏ ప్రస్తుతం 46 శాతంగా ఉండగా.. 4 శాతం పెంచాల్సి ఉంటుంది. మార్చిలో 4 శాతం డీఏ పెంపు ప్రకటన వచ్చినా అది జనవరి 1, 2024 నుంచే అమలు చేస్తారు. ఈ బకాయిలు కూడా చెల్లించవచ్చు.
శాలరీ ఎంత పెరుగుతుంది?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి డీఏ, డీఆర్ పెంపు 4 శాతంగా ఉందనుకుంటే మొత్తంగా డీఏ 50 శాతానికి చేరుతుంది. ఉదాహరణకు రూ.53,500 బేసిక్ శాలరీ ఉన్న ఒక వ్యక్తికి ప్రస్తుత డీఏ 46 శాతం ప్రకారం డియర్ నెస్ అలవెన్స్ రూ.24,610 వస్తోంది. ఇప్పుడు 4 శాతం పెంచి డీఏ 50 శాతానికి పెరిగితే అతిని డియర్‌నెస్ అలెవెన్స్ రూ.26,750కి చేరుతుంది. అంటే శాలరీ రూ.2,140 పెరగనుంది. మరోవైపు.. పెన్షనర్ల విషయానికి వస్తే ఒక వ్యక్తికి బేసిక్ పెన్షన్ రూ.41,100 వస్తుంది అనుకుందాం. ప్రస్తుత డీఆర్ 46 శాతం ప్రకారం అతనికి డియర్‌నెస్ రిలీఫ్ రూ.18,906గా వస్తోంది. అదే 4 శాతం డీఆర్ పెంచినట్లయితే అది 50 శాతానికి చేరుతుంది. దీని ప్రకారం ప్రతి నెలా డియర్ నెస్ రిలీఫ్ రూ.20,550 అందుతుంది. అంటే మొత్తంగా రూ.1,644 డీఆర్ ఎక్కువగా వస్తుంది.