పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాక్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అంగీకరించాయి. అయితే, ప్రధాని పదవి విషయంలో నవాజ్ తీసుకున్న నిర్ణయం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారని భావించిన వేళ.. తన సోదరుడు షెహబాజ్ షరీఫ్‌ను ఆయన నామినేట్ చేస్తూ షాక్ ఇచ్చారు.
ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు ట్విటర్‌లో వివరాలు వెల్లడించారు. దీంతో పీఎంఎల్-ఎన్, పీపీపీ సంకీర్ణ ప్రభుత్వం తరఫున ప్రధానిగా షెహబాబ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తమ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ తన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఔరంగజేబు తెలిపారు. అలాగే, నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్‌ను పంజాబ్ ప్రావిన్సుల ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. పీఎంఎల్-ఎన్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దేశం సంక్షోభం నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. అయితే, పాక్ సైన్యం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. అయితే, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ ప్రధాని పదవి ఆశించారని, ప్రధాని పదవిని పంచుకోవాలని వార్తలు వెలువడ్డాయి.
ఈ క్రమంలో ప్రధాని పదవి రేసు నుంచి తాను వైదొలగినట్టు బిలావల్ భుట్టో తాజాగా ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలో తమ పార్టీ భాగస్వామి కాకుండానే. ‘పీఎంఎల్-ఎన్’ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. దీంతో నవాజ్ షరీఫ్ నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. కానీ, ఆయన తన తమ్ముడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 265 స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలుపొందారు. పీఎంఎల్-ఎన్ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలుపొందింది.
కాగా, నవాజ్ ప్రకటన వెలువడటానికి ముందు రోజు మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారని తెలిపారు. అంతేకాదు, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన బిలావల్ భుట్టో, ఆయన తండ్రి అసిఫ్ అలీ జర్దారీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, పాక్ కొత్త సంకీర్ణ ప్రభుత్వంలో 17 సీట్లు గెలిచిన ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్-పాకిస్థాన్ కూడా భాగస్వామిగా చేరుతున్నట్టు ప్రకటించింది.