ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ 2026లో అధికారులు కీలక సంస్కరణలు చేపట్టారు. ఈసారి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.పరీక్ష పూర్తైన వెంటనే కంప్యూటర్ స్క్రీన్‌పై అభ్యర్థికి వచ్చిన మార్కులు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అంతేకాకుండా, ఆ మార్కుల ఆధారంగా ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉందో కూడా అంచనా వేయగలిగే విధంగా ఏర్పాట్లు చేశారు.దీనికోసం గత రెండేళ్ల ఫలితాల ఆధారంగా ర్యాంకుల డేటాను ఎప్సెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. దరఖాస్తు ప్రక్రియలో కూడా మార్పులు చేశారు. ఇకపై విద్యార్థులు మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్ ద్వారానే సులభంగా అప్లై చేసుకునేలా మొబైల్-అడాప్టివ్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు.ఎప్సెట్ 2026 కన్వీనర్ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎక్కడి నుంచైనా మొబైల్ ద్వారానే దరఖాస్తు పూర్తి చేయవచ్చని చెప్పారు.అదనంగా, దరఖాస్తు సమయంలో ఎంపీసీ స్థానంలో బైపీసీ లేదా బైపీసీ స్థానంలో ఎంపీసీ ఎంపిక చేసినట్లయితే వెంటనే అభ్యర్థికి ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి పొందిన వివరాల ఆధారంగా ఈ పర్యవేక్షణ ఉంటుంది. దరఖాస్తులో పొరపాట్లు జరిగితే ఎప్సెట్ సెంటర్ నుంచే కాల్ చేసి సరిదిద్దే అవకాశం కల్పిస్తారు. దీని వల్ల అప్లికేషన్ లోపాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, గురువారం నుంచి ఎప్సెట్ 2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. వివిధ కారణాలతో ఆలస్యమైన వారు పరీక్షకు రెండ్రోజుల ముందు వరకు రూ.10,000 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకునే వీలుంది.ఎస్సీ వర్గీకరణ అమలులో భాగంగా ఈసారి ఎస్సీ 1, 2, 3 కేటగిరీల రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఎప్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 4, 5 తేదీల్లో, ఇంజనీరింగ్ పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa