ఓ గ్రామానికి సమీపంలోని అడవిలో వందలాది గోవుల కళేబరాలు గుర్తించడం కలకలం రేగుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి సమీపంలో అడవిలో వెలుగుచూసింది. వందలాది ఆవుల కళేబరాలు అక్కడకు ఎలా వచ్చాయి? ఏవైనా వ్యాధితో చనిపోయాయా? ఎవరైనా తెచ్చి పడేశారా? అనేది మాత్రం తెలియరాలేదు. శివపురి-ఝాన్సీ జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో సిల్లియర్‌పూర్ గ్రామం అడవిలో కనీసం 400 నుంచి 500 కళేబరాలు పడి ఉన్నాయి. వీటిలో కొన్ని ఆవులు సజీవంగా కనిపించడంతో ఈ దృశ్యం స్థానిక గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది.
రాత్రిపూట సమీపంలోని పట్టణాల నుంచి కొందరు తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు గ్రామస్థులు భావిస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ గ్రామ ప్రధాన్ అరవింద్ లోధీ ఆరోపించారు. మొత్తం 500 వరకూ కళేబరాలు ఉంటాయని ఆయన అన్నారు. సమీపంలోని కరైరా మున్సిపాలిటీలో చనిపోయిన ఆవులను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంటారని స్థానిక పశువైద్యుడు డాక్టర్ వాదిల్ జాతవ్ చెప్పారు. ఝాన్సీ నగరం సహా సమీపంలోని పట్టణాల నుంచి తీసుకొస్తారని తెలిపారు.
వీటిని ఇక్కడే ఎందుకు పడేస్తున్నారో కారణం తెలియదని ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన చలి కారణంగా ఆ ఆవులన్నీ చనిపోయి ఉండవచ్చని కేరారా పోలీసులు తెలిపారు. చనిపోయిన జంతువులను సల్లియపూర్ గ్రామం అడవి వద్ద పడేస్తుంటామని మున్సిపాలిటీ కార్మికులు కూడా చెప్పినట్టు ఆయన వివరించారు. ‘ఆవులు పెద్దఎత్తున మృత్యువాత పడ్డాయి.... చలికి చనిపోయాయి.. చనిపోయిన ఆవులను మున్సిపల్ ఉద్యోగులు అక్కడే పడేసి ఉంటారు.... ఆవులను ఎవరు చంపారనే సమాచారం లేదు’ అని కేరారా స్టేషన్ ఇన్ చార్జి సురేష్ శర్మ తెలిపారు.