తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోటా టోకెన్లు విడుదల కానున్నాయి. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదులు, శ్రీవారి సేవ కోటా టోకెన్లు రిలీజ్ చేయనున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 23న) అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేస్తారు. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఫిబ్రవరి నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంతేకాదు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మరోవైపు ఫిబ్రవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తోంది టీటీడీ. మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదలపైనా క్లారిటీ ఇచ్చారు. తిరుమల, తిరుపతిలలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న శ్రీవారి సేవ కోటా విడుదల చేయనున్నారు. ఆ రోజు (ఫిబ్వరి 27న) ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. మరోవైపు తిరుపతికి చెందిన శ్రీ మణి రెండు పరదాలు, రెండు కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల గోడపత్రికను మంగళవారం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. తిరుపతిలోని పద్మావతి పురంలో గల ఛైర్మన్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఆలయంలో మార్చి 8 నుంచి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. మార్చి 17న సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa