ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంతలో పడిన అంబులెన్స్‌.. లేచి కూర్చున్న బ్రెయిన్ డెడ్ మహిళ

national |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 07:39 PM

రోడ్లపై గుంతలు ప్రాణాలు తీస్తాయని అందరికీ తెలుసు, కానీ అవే గుంతలు పోయిన ప్రాణాన్ని తిరిగి తెస్తాయని ఎవరైనా ఊహించగలరా? కానీ ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఈ విచిత్ర సంఘటన జరిగింది. విదేశాల్లో రోడ్లు అద్దంలా మెరిసిపోతుంటే డ్రైవర్లు హాయిగా నిద్రపోతారేమో కానీ, మన దేశంలో రహదారులపై ఉండే గుంతలు మాత్రం నిద్రపోతున్న ప్రాణాలను కూడా తట్టి లేపుతున్నాయి. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన చూస్తుంటే, మన ప్రభుత్వాలు రహదారులపై గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేయడం వెనుక ఏదైనా ‘దైవిక చింతన’ ఉందేమో అన్న అనుమానం కలగక మానదు.


వివరాల్లోకి వెళ్తే... ఉత్తర్ ప్రదేశ్‌‌లోని ఫిలిబిత్‌కు చెందిన వినీత శుక్లా అనే వివాహిత తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల ఆసుపత్రిలో చికిత్స అందించినా.. స్పృహ‌లోకి రాలేదు. వైద్యానికి ఆమె స్పందించకపోవడంతో పరీక్షించిన డాక్టర్లు 'బ్రెయిన్ డెడ్' అని ప్రకటించారు. ఇక ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు, కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అంత్యక్రియల కోసం ఆమెను అంబులెన్స్‌లో ఫిబ్రవరి 24న ఇంటికి తీసుకెళ్తున్నారు. అంతా అయిపోయింది అనుకుంటున్న తరుణంలో బరేలీ-హరిద్వార్ 74వ నెంబరు జాతీయ రహదారిపై ఆ అంబులెన్స్ వెళ్తుండగా.. హఫీజ్‌గంజ్ వద్ద ఒక భారీ గుంతలోకి దిగి, భారీ కుదుపునకు గురైంది.


ఈ సమయంలో 'బ్రెయిన్ డెడ్' అయిన మహిళలో చలనం వచ్చింది. ఆమె ఊపిరి తీసుకోవడం గమనించిన భర్త కులదీప్ కుమార్ శుక్లా షాకయ్యారు. వెంటనే మళ్లీ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె కోలుకుని సోమవారం ఇంటికి వచ్చారు. కులదీప్ కుమార్ మాట్లాడుతూ.. ‘భారీ గుంతలో అంబులెన్స్ దిగిన తర్వాత కుదుపునకు గురయ్యింది.. ఈ సమయంలో అద్భుతం జరిగి నా భార్య సాధారణంగా ఊపిరి తీసుకోవడంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు ఆపేయాలని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాను’ అన్నారు.


క్రిటికల్ మెడికల్ కేర్‌లో చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్న ఆమెను సోమవారం డిశ్చార్జ్ చేశారు. తాను కోమాలో నుంచి బయటపడటమే కాదు మాతో మాట్లాడుతోంది అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఘటనపై బరేలీలోని న్యూరోసిటీ హాస్పిటల్ న్యూరోసర్జన్ డాక్టర్ రాకేశ్ సింగ్ మాట్లాడుతూ.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్టు తెలిపారు. వైనీతా మెదడు కండరాల్లో ప్రతిస్పందన కనిపించలేదని, సాధారణంగా 15 పాయింట్లు ఉండే ఆమె గ్లాస్గో కోమా స్కేల్ 3కి పడిపోయిందన్నారు. ఇది బ్రెయిన్ డెడ్‌కు సంకేతమని అన్నారు. నిర్దారణ పరీక్షల్లో మైడ్రియాసిస్ అంటే కళ్లు గుండ్రంగా తిరగడం కనిపించలేదని, మెదడు సంకేతాలు నిలిచిపోయాయని సూచించే లక్షణమని చెప్పారు.


ఫిలిబిత్ జ్యూడీషియల్ కోర్టులో సీనియర్ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్న వినీత.. ఫిబ్రవరి 22న ఇంటిలో పనిచేస్తుండగా ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం బరేలీకి రిఫర్ చేశారు.


గుంతలు - మన ప్రాణదాతలు!


సాధారణంగా రోడ్ల మీద గుంతలు ఉంటే మనం ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. కానీ ఈ ఘటన తర్వాత మనం మన ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలేమో! కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రుల్లో ఇచ్చే ‘ఎలక్ట్రిక్ షాక్’ పని చేయని చోట, మన రోడ్డు మీద ఉచితంగా దొరికే ‘గుంత షాక్’ అద్భుతంగా పని చేసింది.


వైద్యశాస్త్రం చేతులెత్తేసిన చోట, 'మున్సిపల్ సైన్స్' విజయం సాధించింది. ఏది ఏమైనా భారతీయ రహదారులపై ప్రయాణం యమ గండం" అని అంటుంటారు. కానీ ఇప్పుడు "యమ గండం నుంచి తప్పించాలన్నా ఈ రోడ్లే దిక్కు" అని నిరూపితమైంది. బహుశా అందుకేనేమో ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు గుంతలను పూడ్చడం లేదు.. ఎక్కడ, ఎవరికి, ఎప్పుడు 'పునర్జన్మ' అవసరమవుతుందో అని వారి ముందుచూపు కాబోలని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు గుంత కనిపిస్తే తిట్టుకోకండి, అది ఎవరికో ఒకరికి 'లైఫ్ సేవర్' కావచ్చని గుర్తుంచుకోవాలని సెటైర్లు వేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa