భారతదేశానికి సేవలు అందించిన ప్రధానమంత్రుల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పేరు మొదటివరుసలో ఉంటుంది. 10 ఏళ్లుగా ప్రధాని కుర్చీలో కూర్చున్న నరేంద్ర మోదీ.. ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయనకు ఎంతో ఛరిష్మా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిర్వహించిన ఈ అధ్యయనంలో నరేంద్ర మోదీ టాప్‌లో నిలిచారు. బైడెన్, ట్రూడో, సునాక్‌లను కాదని.. ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానం దక్కించుకున్నారు.
జనవరి 30 వ తేదీ నుంచి ఫిబ్రవరి 5 వ తేదీ వరకు మార్నింగ్ కన్సల్ట్ వెబ్‌సైట్ ఈ సర్వే నిర్వహించింది. వివిధ దేశాల అధినేతలకు వారి వారి దేశాల్లో ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో ఈ సర్వేలో లెక్కించారు. ఈ సర్వే ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీకి మన దేశంలో 78 శాతం జనం అనుకూలంగా ఓటు వేశారు. అంటే మన దేశ జనాభాలో 78 శాతం మంది మోదీని నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారని తేలింది. దీంతో 78 శాతంతో మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు.
అయితే గత ఏడాది డిసెంబర్‌లో ఇదే మార్నింగ్ కన్సల్ట్ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో 76 శాతం ప్రజాదరణ లభించింది. అంటే నెల రోజుల్లోనే ప్రధాని మోదీకి మద్దతు మరో 2 శాతం పెరగడం మరో విశేషం. దీంతో మరికొన్ని రోజుల్లో దేశంలో జరగనున్న లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మోదీ హవా కొనసాగుతోందని బీజేపీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ప్రధాని మోదీ చెప్పే విశ్వ గురూ కల సాకారం అవుతోందని కాషాయ వర్గాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపు కొనసాగితే ఈసారి ఎన్నికల్లో గెలిచి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తామని.. కమలం పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఉంటారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే మార్నింగ్ కన్సల్ట్ వెబ్‌సైట్ నిర్వహించిన ఇదే సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌లు చాలా స్థానాలు వెనకబడి ఉన్నారు. ఈ లిస్ట్‌లో మోదీ తర్వాత మెక్సికో అధ్యక్షుడు అండ్రూస్ మాన్యుల్ లోపెజ్ ఒబ్రాడర్ రెండో స్థానంలో నిలిచారు.