దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒకే చర్చ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై రాజకీయ పార్టీలతోపాటు దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏ క్షణంలోనైనా దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మార్చి 13 వ తేదీ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను వెలువరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి మరింత సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతను అంచనా వేయడానికి ఎన్నికల సంఘం అధికారుల బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. అయితే ఈ పర్యటనలు పూర్తయిన వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. వచ్చే నెల 13 వ తేదీ లోపు రాష్ట్రాల పర్యటన పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా గత కొన్ని రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల అధికారులతో సమావేశాలను నిర్వహిస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలు, ఈవీఎంల తరలింపు, భద్రతా బలగాల అవసరం, సరిహద్దుల్లో పటిష్ట నిఘా వంటి అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు.
ఈసారి ఎన్నికలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ వాడాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్స్‌లో ఫేక్ ప్రచారాన్ని అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే మే నెలలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దేశం మొత్తం 96.88 కోట్ల మంది ప్రజలు ఓటర్లుగా నమోదై ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత ఎక్కువ మంది ఓటర్లు లేకపోవడం గమనార్హం.
లోక్‌సభ ఎన్నికలను స్వేచ్చగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఏఐ సేవలను వినియోగించుకోనున్నారు. ఎన్నికలు జరిగే సమయంలో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఉంటే ఆ కంటెంట్ వెంటనే తొలగించేందుకు ఈ ఏఐని ఉపయోగించనున్నారు. ఏదైనా పార్టీ లేదా అభ్యర్థి నిబంధనలను ఉల్లంఘిస్తే వారి సోషల్ మీడియా అకౌంట్లను సస్పెండ్ చేయాలని.. లేదంటే బ్లాక్ చేయాలని సదరు ప్లాట్ ఫామ్‌లను కోరతామని తేల్చిచెప్పారు. సున్నిత ప్రాంతాల్లో తప్పుడు సమాచారం ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. ఆ వార్తలు నిజమో కాదో ఏఐ ద్వారా ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రజలకు తెలియజేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.