తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మరణించడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, పదుల సంఖ్యలో భక్తులు గాయపడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట మరణాలకు ఎవరు నైతిక బాధ్యత వహిస్తారని, సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్‌లలో ఎవరు రాజీనామా చేస్తారని విరూపాక్షి ప్రశ్నించారు. మృతుల వైయస్ఆర్‌సీపీ తరఫున సంతాపం తెలుపుతూ ప్రభుత్వ తీరును తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఎండగట్టారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరమని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ఎంతో భక్తిశ్రద్దలతో ఉండాల్సిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి మీడియా పిచ్చి, రాజకీయ పిచ్చి ఉందని, అలాంటి వ్యక్తిని టీటీడీ ఛైర్మన్‌గా చంద్రబాబు కూర్చోబెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు తీరుతో కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, కూటమి ప్రభుత్వంలో పూర్తిగా టీటీడీని రాజకీయ వేదికగా మార్చారని ధ్వజమెత్తారు. పవిత్రమైన తిరుపతిలో ఇంత అపవిత్రం జరిగింది, గతంలో వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఏ రోజూ ఏ తప్పు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.