వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలివస్తారని తెలిసి కూడా, టోకెన్ల జారీలో తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైన కారణంగానే ఈ తొక్కిసలాట ఘటన జరిగిందని మాజీ మంతి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. భక్తులు ఏమైపోయినా పర్లేదని భావించారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు జరిగితే వైయస్ జగన్ మీద తోసేయొచ్చన్న ధీమానా? మంచి జరిగితే మన ఖాతాలో, చెడు జరిగితే వైయస్ జగనే కారణం అన్నట్టుగా గత ఏడు నెలలుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.రెవెన్యూ, పోలీస్, ఇంటిలిజెన్స్ విభాగాలన్నీ ఏమైపోయాయి. భక్తుల ప్రాణాల విషయంలో ఎందుకింత అలసత్వంగా వ్యవహరించారు. ఈ నిర్లక్ష్యానికి సీఎం, టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో వెంకన్న చౌదరిలలో ఎవరు బాధ్యత తీసుకుంటారని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చరిత్రలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా వాడుకోలేకపోవడం బాధాకరం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని స్పష్టంగా చెబుతోందన్నారు. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని తాను ముందే ఊహించానని, పోలీసు అధికారులను ఆ మేరకు హెచ్చరించానని టీటీడీ ఛైర్మన్ చెప్పడం హేయమన్నారు. దీన్ని బట్టి పేరుకే ఆయన చైర్మన్ అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చైర్మన్ మాటలు సిగ్గుచేటు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు.