హైందవ శంఖారావం నిర్వహించిన పెద్దలంతా తిరుమల ఘటన పై బయటకు రావాలి. బాధితుల కుబుంబాలతో మాట్లాడాలి. బాధ్యులపై చర్యలు తీసుకునే దాకా పోరాడాలని మాజీ మంత్రి రోజా విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డూ మీద తప్పుడు ప్రచారం జరిగినప్పుడు రైళ్లలో చిడతలు వాయించుకుంటూ వచ్చి హడావుడి చేసిన మాధవీలత వంటి వారు ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శాంతి భద్రతలపై అవగాహన, శాఖ మీద పట్టులేని వారిని హోం మంత్రిగా నియమిస్తే ఏం జరుగుతోందో చెప్పడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే ఉదాహరణ అన్నారు. గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ నిర్వహణలో పెట్టిన చిత్తశుద్ది కూడా భక్తుల భద్రతపై అధికారులు పెట్టలేదు. సనాతనవాదిగా చెప్పుకునే పవన్‌కళ్యాణ్ దీనికి ఏం ప్రాయశ్చిత్తం చేస్తారో చెప్పాలి. దీనికి సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలని ఆమె డిమాండు చేశారు. ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పడానికి సెక్షన్–194 బీఎఎన్‌ఎస్ కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని ఆర్కే రోజా హెచ్చరించారు. తప్పు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టేదాకా బాధితుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాడుతోంది. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేసారు.