వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘తప్పు జరిగింది.. బాధ్యత తీసుకుంటాం. క్షతగాత్రులు, రాష్ట్ర ప్రజలు, వేంకటేశ్వరస్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరినీ క్షమించమని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. ఈ ఘటన జరగకుండా ఉండాల్సింది. క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా జరగలేదని భక్తులు చెబుతున్నారు. తితిదే సిబ్బంది, పోలీసులు ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీఐపీలపై కాదు.. సామాన్యులపైనా తితిదే దృష్టిపెట్టాలి. మృతుల కుటుంబాల వద్దకు తితిదే సభ్యులు వెళ్లి క్షమాపణలు చెప్పాలి’’ ‘‘తొక్కిసలాట ఘటనకు తితిదే ఈవో, ఏఈవో బాధ్యత తీసుకోవాలి. ఘటనా స్థలిలో ఉన్న పోలీసులు బాధ్యత తీసుకోవాలి. అధికారులు చేసిన తప్పులకు మేం తిట్లు తింటున్నాం. తొక్కిసలాట జరిగితే సహాయక చర్యలు ఎలా ఉండాలనే ప్రణాళిక లేదు. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయి. భవిష్యత్తులో దుర్ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. పోలీసుల్లో కొందరు కావాలని చేశారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటిపై విచారణ జరగాల్సి ఉంది. ఈవో, అదనపు ఈవో, పాలకమండలికి మధ్య గ్యాప్ ఉందనే వాదన ఉంది. ఇంతమంది పోలీసు అధికారులున్నా తప్పు ఎందుకు జరిగింది? పోలీసుశాఖ నిర్లక్ష్యంపై సీఎం, డీజీపీ దృష్టికి మళ్లీ తీసుకెళ్తా. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 8-9 గంటలు ఎదురు చూసే పరిస్థితి మారాలి. సాధ్యమైతే ఒకట్రెండు గంటల్లో దర్శనం జరిగేలా చూడాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.