తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి దుర్మరణం, పలువురు క్షతగాత్రులైన దుర్ఘటనకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని, ఆ మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే అని వైయస్ఆర్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి సేవలో భక్తులకు సదుపాయాలు కల్పించాల్సిన అన్ని వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరలించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన ఈఓ శ్యామలరావును బదిలీ చేయాలని, టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీని వెంటనే సస్సెండ్ చేయాలని, ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున, క్షతగాత్రులకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.