సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడు పవన్ కళ్యాణ్ ఇంత వరకు దీనిపై ఎందుకు స్పందించలేదు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని కాపాడేవారు అనేక మంది ఉన్నారు. అటువంటి వారు ఇటువంటి ఘటనలపై స్పందించాలి. ధర్మ పరిక్షణ కోసం ఏం చేయాలో చెప్పాలి. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో ఈ ప్రభుత్వానికి సూచించాలి. పీఠాధిపతులు, స్వామీజీలు స్పందించాలని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారికి కోటి రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులకు కనీసం పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రమాదం జరిగిన తరువాత కూడా వైద్యశాలకు వెళ్ళినటువంటి వైద్యం అందలేదు. గాయపడిన వారి పట్ల కనీసం బాధ్యత తీసుకోలేదు. చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకున్న తిరుపతి ఎస్పీ ప్రజల కోసం కాకుండా కేవలం టిడిపి కోసమే పనిచేస్తున్నాడు. వైయస్ఆర్ సీపీపై తప్పుడు కేసులు బనాయించడంలోనే ఆయన మునిగిపోయాడు. ఈ ప్రమాదంపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండు చేశారు.