తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలకు బదులుగా రూ.కోటి ఇవ్వాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, లిడ్‌క్యాప్ మాజీ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో నమోదు చేసిన కేసులను బీఎన్‌ఎస్–105 సెక్షన్‌లోకి మార్చకపోతే ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. తొక్కిసలాట ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారని ఆక్షేపించారు.గురువారం ఆయన వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదం. గతంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి దినమని రాజశేఖర్ ఆక్షేపించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయాలకు వాడుకోవడంతో పాటు, టీటీడీ బాధ్యతలను రాజకీయ కారణాలతో వివాదాస్పదమైన వ్యక్తుల చేతుల్లో పెట్టింది. బాధ్యతలు తీసుకున్న వారు భక్తుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఈ దారుణమైన తొక్కిసలాట ఘటన చోటుచేసుకుందన్నారు. గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి పని చేసినప్పుడు భక్తులు చాలా ప్రశాంతంగా దర్శనాలు చేసుకుని వెళ్లారు. టీటీడీ గొప్పతనాన్ని ఇనుమడింపజేసేలా వారు సేవలందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీని టీడీపీ కార్యాలయంగా మార్చేశారు. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత భక్తులకు ఏర్పాట్లు చేయడానికి ఇవ్వలేదని రాజశేఖర్ విమర్శించారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా పర్యవేక్షణ బాధ్యతలు డీఎస్పీ స్థాయి అధికారికివ్వడం బట్టి చూస్తే భక్తుల రక్షణపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అర్థమవుతుంది. స్థానిక ఎస్పీ చంద్రబాబు తొత్తుగా మారి ఆయన సేవలోనే నిమగ్నమయ్యారు. టికెట్ల కోసం వచ్చే భక్తుల భద్రతను ఆయన గాలికొదిలేశారని మండిపడ్డారు.