గడిచిన కొన్నిరోజులుగా సాగుతున్న నిరీక్షణ ముగిసింది. తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా రిలీజైంది. 118 మందితో తొలి జాబితా అని ప్రకటించినప్పటికీ.. 99 మంది పేర్లను మాత్రమే వెల్లడించారు. అందులో టీడీపీకి 94, జనసేన నుంచి ఐదుమంది నేతల పేర్లు ఉన్నాయి. అయితే తొలి జాబితా ప్రకటన టీడీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టికెట్ దక్కని నేతలు, పొత్తులో తమ సీటు కోల్పోయిన లీడర్లు బాబు మీద గుర్రుగా ఉన్నారు. మరికొంతమంది ఫ్లెక్సీలు చించేయడం మొదలెట్టారు. మరికొంతమంది పార్టీకీ గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించగా.. మరికొంత అసంతృప్తులు కూడా అదే బాటలో వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
అయితే కృష్ణా జిల్లాలోని ఓ టీడీపీ సీనియర్ నేత మాత్రం టికెట్ రానందుకు మహదానందంగా ఉందంటున్నారు. జాబితాలో తన పేరు లేనందుకు చాలా ఆనందంగా ఉన్నానంటున్నారు. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షి లాగా... స్వేచ్చా స్వాతంత్ర్యాలు పొందినట్లు ఉందని చెబుతున్నారు. ఆయన ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ టీడీపీ ఇంఛార్జి మండలి బుద్ధప్రసాద్. తొలి జాబితాలో తనపేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఇలా.. సెటైరికల్ వ్యాఖ్యాలు చేశారు. మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నుంచి టీడీపీ టికెట్ ఆశించారు. అయితే జనసేనకు టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండగా.. టికెట్ తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. అయితే శనివారం తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు.. అవనిగడ్డను మాత్రం పెండింగ్‌లో పెట్టారు.ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యా్ఖ్యలు చేశారు.
"ఈ రోజు మొదటి విడత లిస్ట్ లో నా పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నాను. పంజరం లోంచి బయటకు వచ్చిన పక్షి లాగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందినట్లు ఉంది. దయచేసి కార్యకర్తలు, నాయకులు ఇది గమనించి వ్యవహరించండి. నా ఆలోచనలు, నేను నమ్మిన సిద్దాంతాలు మీకు తెలుసు. పదవులకోసం పుట్టలేదు. పదవులు లభించినప్పుడు ప్రజలకు మేలు చేయడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి ప్రయత్నించాను తప్ప ఆ పదవులను అడ్డుపెట్టుకుని దోచుకోలేదు, దాచుకోలేదు.రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమై పోయింది. ఓటరుని కొనుగోలు వస్తువుగా రాజకీయపక్షాలు భావిస్తున్న తరుణంలో ధనవంతుల కోసం అన్వేషిస్తున్న తరుణంలో నాబోటి వాడు ఎన్నికల్లో నిలబడాలని భావించడం కూడా సమంజసం కాదు. పరిస్దితులను కార్యకర్తలు,ప్రజలు అర్దం చేసుకోండి. దయచేసి వేరేవిదంగా ఆలోచించవద్దు" అంటూ మండలి బుద్ధ ప్రసాద్ ఫాలోవర్లు నిర్వహించే గ్రూపులో పోస్ట్ చేశారు.
అయితే రాజకీయాలు మారిపోయాయని, డబ్బే ప్రధానమైపోయిందంటూ మండలి బుద్ధప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టికెట్ దక్కలేదేనే అసంతృప్తితోనే మండలి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన తొలి జాబితాకు ముందు మండలి బుద్ధ ప్రసాద్ చేసిన ట్వీట్.. లిస్ట్ వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణకై నడుంకట్టిన పసుపు దళాధిపతి, జనసేనానిల నాయకత్వంలో కలిసి నడుద్దాం కదలిరండి అంటూ మండలి బుద్దప్రసాద్ తొలుత ట్వీట్ చేశారు. అయితే లిస్టు విడుదలైన తర్వాత తన పేరులేకపోవటంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.