తెలుగు ఐఏఎస్ అధికారి హత్య కేసులో బిహార్ మాజీ ఎంపీ, ఆర్జేడీ నేత ఆనంద్ మోహన్‌కు శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా కలెక్టరుగా ఉన్న తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన జి.కృష్ణయ్య 1994లో మూకహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్జేడీ నేత ఆనంద్ మోహన్‌ను దోషిగా గుర్తించిన న్యాయస్థానం ఆయకు జీవితఖైదు విధించింది. అయితే, ఆయనకు గతేడాది రెమిషన్ లభించి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఐఏఎస్ అధికారి భార్య ఉమా కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం సోమవారం వాదోపవాదాలు విననుంది. బిహార్ ప్రభుత్వం జైలు మార్గదర్శకాల్లో చేసిన సవరణల కాణంగా పద్నాలుగేళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించిన ఆనంద్‌మోహన్‌తోపాటు మరికొందరు దోషులు గతేడాది ఏప్రిల్ నెలలో సహర్సా జైలు నుంచి విడుదలయ్యారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆనంద్ మోహన్‌ను విడుదల చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం మాన్యువల్‌ను సవరించిందని సర్కారు తీరుపై అప్పట్లో పలు విమర్శలు వచ్చాయి.
1994లో ఎమ్మెల్యేగా ఉన్న ఆనంద్ మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్యాంగ్‌స్టర్ ఛోటన్ శుక్లా అంతిమయాత్రను జిల్లా అధికారి కృష్ణయ్య వాహనం ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్లబోయింది. ఆ సమయంలో ఆనంద్ మోహన్ రెచ్చగొట్టడం వల్లే గుంపుగా మీదపడి కృష్ణయ్యను కొట్టి చంపినట్లు ప్రధాన అభియోగం. ఈ కేసులో 2007 అక్టోబరు 5న ఆనంద్ మోహన్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. దీన్ని హైకోర్టులో సవాల్ చేయడంతో జీవితఖైదుగా సవరించింది. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఆనంద్ మోహన్‌కు గతేడాది రెమిషన్ లభించింది.
దీనిపై తీవ్ర విమర్శలు రాగా.. బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గత నెల 6న మాజీ ఎంపీ పాస్‌పోర్ట్‌ను సమర్పించి, ప్రతి రెండు వారాలకు ఒకసారి పోలీస్ స్టేషన్‌కు రావాలని కోర్టు సూచించింది. ఈ కేసులో మోహన్‌తో పాటు ఎంతమంది దోషులను విడుదల చేశారో చెప్పాలని బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మొత్తం 97 మందిని విడుదల చేసినట్టు ప్రభుత్వం అఫిడ్‌విట్ సమర్పించింది.