వలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీలవుతామని, చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా? అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడికి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వడ్డెర ఆత్మీయ సమావేశంలో సజ్జలతో పాటు ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి, వడ్డెర కారొరేషన్ ఛైర్మన్ దేవళ్ళ రేవతి, పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మన దగ్గర అవకాశం దక్కని వారు బయటకు వెళ్తున్నారని, గుమ్మనూరి జయరాం రాజీనామా చేస్తే ఆయన్ను టీడీపీ జాయిన్ చేసుకుంటోందన్నారు. జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు తన అనుకూల ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు.