ఏపీ ఎన్నికల్లో వైనాట్ 175 అంటున్న వైఎస్సాఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. ఆ దిశగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వేలు, సమీక్షలు జరిపిన జగన్.. గెలుపు గుర్రాలను అన్వేషించి వారిని బరిలో నిలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాలలోని సామాజిక వర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 12 లిస్టుల ద్వారా నియోజకవర్గాల ఇంఛార్జులను ప్రకటించిన సీఎం జగన్.. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తే నిర్మొహమాటంగా పక్కనపెడుతున్నారు. అయితే మొత్తానికి వైసీపీ అభ్యర్థుల తుది జాబితా రెడి అయినట్లు తెలిసింది.
ఇంఛార్జీలనే అభ్యర్థులుగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. వైఎస్ జగన్ మార్పుల కారణంగా బీఫామ్ వచ్చే వరకూ అభ్యర్థిత్వంపై క్లారిటీ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫైనల్ లిస్ట్ రెడీ చేసిన జగన్.. అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. డేట్ అంట్ టైమ్ ఫిక్స్ చేసిన వైఎస్ జగన్.. ఇందులోనూ 2019 విధానాన్నే అనుసరిస్తున్నారు. మార్చి 16వ తేదీన వైసీపీ ఫైనల్ జాబితా రిలీజ్ చేస్తారని తెలిసింది. మార్చి 16వ తేదీన వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయను సందర్శించనున్నారు. అక్కడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద వైసీపీ తరుఫున అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జగన్ ప్రకటించనున్నారు. అయితే 2019 శాసనసభ ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే వైఎస్ జగన్ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ సారి కూడా అదే సెంటిమెంట్ ఫాలోకానున్నారు. దీంతో జగనన్న సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే మరోసారి వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని ఫ్యాన్ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి.
ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. మార్చి 18న ఇచ్ఛాపురం నుంచి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రోజుకు రెండు లేదా మూడు బహిరంగ సభలు, రోడ్ షోలలో సీఎం జగన్ పాల్గొనేలా వైసీపీ పార్టీ షెడ్యూల్‌ను రూపకల్పన చేస్తోంది. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్లు సమాచారం.