కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారికి టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు ఇవ్వలేకపోతున్నామని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. గురువారం పార్టీ పెద్దలు స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని బోడెకు తెలియజేశారు. తనకు టికెట్ నిరాకరించడంతో బోడె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయంపై విలేకరులతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు, లేనప్పుడు కూడా నిజాయితీగా ఉంటూ నియోజకవర్గంలో పార్టీని పటిష్ఠపరిచే క్రమంలో కుటుంబాన్ని కూడా సరిగా పట్టించుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు. చంద్రబాబు, లోకేశ్ ఆశీర్వాదాలతో ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీచేసి గెలిచి పెనమలూరు సీటును చంద్రబాబుకు కానుకగా ఇస్తానని తెలిపారు. చంద్రబాబు కుటుంబం నుంచి ఎవరొచ్చి పోటీ చేసినా తాను ముందుండి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానన్నారు. వారు కాకుండా ఇతరులకు సీటు ఇచ్చే పక్షంలో తాను కూడా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.