యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు 2024, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రేపు (శనివారం) వెలువడనుంది. సాయంత్రం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయనుంది. న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్‌లో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద ఈ ప్రెస్‌మీట్ లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈ మేరకు ‘భారత ఎన్నికల సంఘం ప్రతినిధి’ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి రానుంది. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే అధికారంలో ఉన్న పార్టీలు కొత్తగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. కాగా ప్రస్తుత ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగియనుంది. ఆ గడువుకు ముందే కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా 2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న వెలువడింది. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.