ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదల కానుండగా.. రాజకీయ పార్టీలు ప్రలోభాల పర్వం ముందే మొదలైంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో తాయిలాలు పంపిణీ జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అందజేసిన కానుకలను ఓ గ్రామస్థులు వెనక్కి పంపారు. భజన మందిరానికి మైక్ సెట్ తీసుకొచ్చి ఇవ్వగా.. మాకొద్దంటూ తిప్పి పంపిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండలం కల్‌రోడ్డుపల్లి గ్రామంలోని భజన మందిరానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పీఆర్వో ప్రకాష్, గ్రామ వాలంటీరు శుక్రవారం మైక్‌సెట్ తెచ్చి ఇచ్చారు. అయితే, తమ దేవాలయానికి మైక్‌సెట్ అవసరం లేదని చెప్పి గ్రామస్థులు వాటిని తిరిగి పంపించేశారు.
ఈ సంఘటనకు ముందు చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తరఫున ఆయన తల్లి చెవిరెడ్డి లక్ష్మి.. పార్టీ నాయకులతో కలిసి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడటమే లక్ష్యంగా మైక్‌సెట్లను అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పర్యటన ముగిసిన వెంటనే మైక్ సెట్‌ను కల్‌రోడ్డుపల్లి గ్రామానికి పంపారు. కానీ, గ్రామస్థులు మాత్రం మీ కానుకలు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక తెచ్చినదారినే వెనక్కి తీసుకెళ్లారు. వాలంటీర్ బైక్ నడుపుతుంటే.. వెనక్కి పీఆర్వో మైక్ సెట్‌ను పట్టుకుని ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.