ద్రోణి ప్రభావంతో విజయనగరం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. గాలులు వీస్తూ పిడుగులు కూడా పడ్డాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో చిరు జల్లులే పడతాయని భావించారు. కానీ మధ్యాహ్నం నుంచి ఉరుములు మొదలయ్యాయి. అనేక చోట్ల భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు ప్రజలను భయపెట్టాయి. ఈ వర్షాలు మామిడి, పత్తి, రబీ వరి, ఇతర ఉద్యాన పంటలకు ఉపయోగమంటున్నారు. కాగా రానున్న రెండురోజులూ ఓ మోస్తరు నుంచి భారీ వాన పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.