రాజమండ్రి ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్‌కు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భరత్ ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అతని గంజాయి బ్యాచ్‌ను తనకు అంటగట్టాలని చూస్తే గుడ్డలూడదీస్తా ఖబడ్దార్ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వార్నింగ్ ఇచ్చారు. విశాఖపట్నంలో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. సీఎం జగన్ ఆంధ్రాను నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. ఏపీవ్యాప్తంగా అన్ని గ్రామాలకు గంజాయి పాకిందన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పోలీసులకు ప్రతిపక్ష నేతల మీద ఉన్న శ్రద్ధ నేరస్థులపై లేదన్నారు. ఇంటర్‌పోల్ సమాచారం ఇస్తేకానీ ఇక్కడి యంత్రాంగం మేలుకోలేదంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని గోరంట్ల బుచ్చయ్య చౌధరి డిమాండ్ చేశారు. ఇది చిన్న విషయమేమీ కాదని, దీనివెనుక భారీ కుంభకోణం ఉందన్నారు. డ్రగ్స్ అమ్మి ఆ డబ్బులను ఎన్నికల్లో ఖర్చుపెట్టాలని జగన్ ప్రయత్నమని గోరంట్ల బుచ్చయ్య ఆరోపించారు. జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు, అప్పుల్లో ఏపీ నంబర్ వన్ అయ్యిందని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వం అవసరమా అంటూ ప్రశ్నించారు.
మరోవైపు ఇదే క్రమంలోనే మార్గాని భరత్ మీద గోరంట్ల బుచ్చయ్య చౌదరి విరుచుకుపడ్డారు. మార్గాని భరత్ ఓ పిచ్చోడని.. నోటికొచ్చినట్లు మాట్లాడతాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భరత్‌కు ప్రజలే బుద్ధిచెప్తారని అన్నారు. నిన్నటి వరకూ గంజాయి స్మగ్లర్లను వెంటేసుకుని తిరిగిన భరత్.. ఇప్పుడు తనకు ఆపాదించాలని చూస్తున్నారని అన్నారు. నీ గంజాయి బ్యాచ్‌ను నాకు అంటగట్టాలని చూస్తే.. బట్టలూడదీస్తా.. ఖబడ్దార్ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. అదే స్థానం నుంచి టీడీపీ తరుఫున మరోసారి పోటీచేస్తున్నారు.