తిరుమలలోని అన్నదానం ట్రస్ట్‌కు ఓ భక్తుడు భారీ విరాళం అందించారు. టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు ఎస్ .ఆర్ .ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, తిరుపతికి చెందిన ప్రొఫెసర్ నారాయణరావు రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. శుక్రవారం తిరుమలలోని ఈవో నివాసంలో టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డికి నారాయణరావు డీడీని అందజేశారు. మరోవైపు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా మూడోరోజైన శుక్రవారం శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామి తెప్పపై విహరించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు ఊరేగింపుచేరుకుంది. అనంతరం స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో మూడుసార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మార్చి 24, 25వ తేదీల్లో తిరుమలలో తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం జరగనుంది. ఈ ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మార్చి 25వ తేదీ ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే తుంబురుతీర్థానికి భక్తులను అనుమతిస్తారు. పాపవినాశనం డ్యామ్ వద్ద అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీటితో పాటుగా. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు.