రోగం నయం చేసుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన ఓ రోగి పట్ల కాపాడాల్సిన డాక్టరే కర్కశం చూపించాడు. చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తిపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. కొట్టడమే కాకుండా ఆ రోగిని కాళ్లతో తన్నాడు. అనంతరం ఆ రోగిని గది నుంచి బయటికి ఈడ్చుకెళ్లాడు. ఈ తతంగం మొత్తం ఆ ఆస్పత్రిలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆకాష్ ఉపాధ్యాయ అనే ఓ వ్యక్తి.. తనకు అనారోగ్యంగా ఉందని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. తనకు ఉన్న సమస్యను చెప్పుకునేందుకు డాక్టర్ ఆర్పీ సింగ్‌ను సంప్రదించాడు. దీంతో ఆకాష్ ఉపాధ్యాయను పరీక్షించిన డాక్టర్ ఆర్పీ సింగ్ మందులు రాసిచ్చాడు. ఆ మందులు ఆస్పత్రిలో లేవని.. బయట కొనుక్కోవాలని సూచించాడు. అయితే మందులు బయట ఎందుకు కొనుగోలు చేయాలని.. ఆస్పత్రిలోనే ఇవ్వాలని డాక్టర్‌ను నిలదీశాడు. దీంతో డాక్టర్ ఆర్పీ సింగ్‌కు కోపం చిర్రెత్తుకొచ్చింది. వెంటనే తాను కూర్చున్న కుర్చీలో నుంచి లేచి.. ఆకాష్ ఉపాధ్యాయపై దాడికి దిగాడు.
కుర్చీలో నుంచి లేచి వచ్చి ఆకాష్ ఉపాధ్యాయను కొట్టిన డాక్టర్ ఆర్పీ సింగ్.. అంతటితో ఆగకుండా అతడ్ని కింద పడేసి కాళ్లతో తన్నాడు. ఆ తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు. ఈ వ్యవహారం మొత్తం ఆ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో చివరికి మహోబా జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది. దీంతో ఆయన స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడంతోపాటు ఆకాష్ ఉపాధ్యాయను కొట్టిన డాక్టర్ ఆర్పీ సింగ్‌పై కేసు నమోదు చేశారు. అయితే మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని ఆకాష్ ఉపాధ్యాయ తనను డిమాండ్ చేసినట్లు ఆ డాక్టర్ ఆర్పీ సింగ్ ఆరోపించాడు.