రాయలసీమలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. మార్చి మొదటి వారం నుంచి అక్కడ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శనివారం అనంతపురంలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 27 వరకు ఎండ వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు వ్యాపించిన ద్రోణి బలహీనపడటంతో మళ్లీ పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత ఏడాది తరహాలో ఈసారి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. మరో ఐదు రోజులు పోటీ వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయని పేర్కొంది.
ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గత వారం రోజులుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి.. ఎండల తీవ్రత తగ్గింది. ఉత్తర కోస్తాలో గత వారం రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కానీ, ఉత్తర, దక్షిణ కోస్తాలో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని పేర్కొంది. ఎలాంటి వర్ష సూచన లేదని, వచ్చే ఐదు రోజులు రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఒకటి రెండు చోట్ల అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని తెలిపింది. కాగా, ఏప్రిల్ చివరి వారం, మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.