ఒంగోలు జిల్లాలో యువకులతో పాటు వివిధ కారణాలతో తొలగింపునకు గురైన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చేనెల 16వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. 18 ఏళ్లు పైబడిన యువతీ, యువకులతోపాటు వివిధ కారణాలతో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో అక్రమంగా తొలగించిన వారు కూడా కొత్త ఓటును నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్‌తోపాటు మాన్యువల్‌గా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు), తహసీ ల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పటివరకు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో సుమారు 6వేలకుపైగా కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తులు రాగా తొలగింపుల కోసం ఫాం-7లు వెయ్యి అందాయి. చేర్పులు, మార్పుల కోసం ఫాం-8 దరఖాస్తులు మరో వెయ్యి వరకూ వచ్చాయి. వాటిపై సంబంధిత రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. అర్హత ఉన్న వారికి సత్వరమే ఓటుహక్కు కల్పించనున్నారు.