జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. వాహనం శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్తుండగా బ్యాటరీ చెష్మా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 1.15 గంటలకు 300 అడుగుల లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్), సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టి) సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ రెస్క్యూ బృందాలు 10 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికితీశాయి. కారు డ్రైవర్‌ను జమ్మూలోని అంబ గ్రోతాకు చెందిన బల్వాన్ సింగ్ (47)గా గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.