ఒకటో తేదీ సమీపిస్తున్న వేళ ఏపీలో పింఛన్ల పంపిణీపై పెద్ద చర్చే నడుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీలో పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతుందనే వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో దీనికంతంటికీ టీడీపీనే కారణమని వైసీపీ ఆరోపణలు చేసింది. అవ్వాతాతలకు పింఛన్ అందకుండా ఆలస్యమయ్యేలా ఉందని అంబటి, బొత్స సత్యనారాయణ వంటి మంత్రులు కూడా చెప్పారు. వాలంటీర్లపై టీడీపీ ఫిర్యాదుతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఈ క్రమంలో ఏపీలో పింఛన్ల పంపిణీపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
సీఈసీ నిర్ణయంతో పింఛన్ తీసుకునేవారు ఆందోళన చెందొద్దని సూచించారు. అయితే సీఈసీ నిర్ణయం కారణంగా వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పింఛన్ అందించలేరని అన్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు అందిస్తామని సజ్జల స్పష్టం చేశారు. లబ్ధిదారులు అందరూ సచివాలయానికి వెళ్లి పింఛన్లు తీసుకోవాలని కోరారు. మూడో తేదీ నుంచి పింఛన్లు అందిస్తామని, లబ్ధిదారులంతా తమ సచివాలయానికి వెళ్లి పింఛన్ సొమ్ము తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
మరోవైపు వాలంటీర్ల మీద, వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు కక్ష్య కట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా ఇంటి వద్దకే అందుతుందన్న సజ్జల.. అలాంటీ వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్ తీసుకునే వృద్ధులను, దివ్యాంగులను ఇబ్బంది పెడితే ఏమొస్తుందంటూ మండిపడ్డారు. మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ సైతం ఇదే విషయమై టీడీపీపై విమర్శలు చేశారు.
టీడీపీ నేతలు వాలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. సంక్షేమ లబ్ధిదారులకు లబ్ధి అందకుండా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీ విషయంలోనూ టీడీపీ తీరుపై బొత్స విమర్శలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే డీఎస్సీని ప్రకటించామన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. టీడీపీ నేతలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి డీఎస్సీ పరీక్షను అడ్డుకున్నారని ఆరోపించారు.