ఏపీలో ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో టీడీపీ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బ్లేడ్లతో కోస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి మూకలు కూడా వస్తున్నాయన్న పవన్.. వాళ్లు బ్లే్డ్లతో కోస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
" రోజూ నన్ను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు వస్తున్నారు. అలా వచ్చేవారిలో కిరాయిమూకలు కూడా ఉంటున్నాయి. అలా వచ్చే కిరాయి మూకలు సన్న బ్లేడ్లతో నన్ను, నా సెక్యూరిటీని కోస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల పన్నాగాలు మనకు తెలుసు కదా.. జాగ్రత్తగా ఉందాం. అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చినప్పుడు ఫోటోల కోసం కొన్ని ప్రొటోకాల్ పద్ధతులు పాటిద్దాం. అందరితో కలిసి ఫోటోలు దిగాలని నాకూ ఉంటుంది. ప్రతిరోజు 200 మందిని కలుస్తా" అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన భద్రతపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. అటు ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలని జనసైనికులు సూచిస్తున్నారు, నారా లోకేష్ తరహాలో కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ప్రచార సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్‌ను ఫ్యాన్స్ సూచిస్తున్నారు