తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకూ సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆ మూడురోజుల పాటు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలియజేసింది. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను మూడురోజుల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా వసంతోత్సవాలు జరగనున్నాయి.
వసంతోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 21వ తేదీ ఉదయం ఆరున్నరకు మలయప్పస్వామి మాడవీధులలో విహరిస్తారు. అనంతరం వసంతోత్సవ మండపంలో మలయప్పస్వామికి అర్చకులు అభిషేకం నిర్వహిస్తారు. ఇది పూర్తైన తర్వాత స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండో రోజు శ్రీభూసమేత మలయప్పస్వామి ఉదయం 8 నుంచి 10 వరకూ రెండు గంటలపాటు బంగారు రథంపై నుంచి భక్తులను కటాక్షిస్తారు. మాడ వీధుల్లో విహారం పూర్తైన తర్వాత వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
వసంతోత్సవాల్లో ఆఖరిరోజైన మూడోరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామితోపాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. వసంతోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉత్సవమూర్తులకు మధ్యాహ్న సమయంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. ఇక వసంతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది.
ఒంటిమిట్ట శ్రీసీతారాముల కల్యాణానికి తిరుమల లడ్డూ సిద్ధం
మరోవైపు ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కళ్యాణం ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం ఆరున్నర నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణానికి హాజరయ్యే భక్తులకు ప్రసాదంగా పంచేందుకు తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమవుతున్నాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవకుల సహకారంతో 25 గ్రాముల లడ్డూలను ప్యాక్ చేశారు. దాదాపు 250 మంది శ్రీవారి సేవకులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కో ప్యాకెట్‌లో రెండు లడ్డూల చొప్పున 1.20 లక్షల లడ్డూలను 60 వేల జిప్‌లాక్ ప్యాకెట్లలో సిద్ధం చేశారు.