రాజోలు అనే పదం తనకు తీపి గుర్తు అని, కోనసీమ కొబ్బరి బొండం ఎంత తీపిగా ఉంటుందో 2019లో ఒక్క రాజోలు విజయం తనకు అంత ఆనందాన్ని ఇచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజోలు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తానన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే వైసీపీ నాయకులే అల్లర్లు సృష్టించారన్నారు. మోరి, మోరిపోడుకు చెందిన అనేక మంది జీడిపప్పు పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తించమని అడిగారని, కూటమి పాలన రాగానే వారి కోరిక తీరుస్తామన్నారు. మత్స్యకార నాయకుడు కొపనాతి కృష్ణమ్మ అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నిర్మించారని, అటువంటి చోట దుండగులు స్వామివారి రథాన్ని దగ్ధం చేస్తే నేటికీ అతీగతీ లేకుండా పోయిందన్నారు. సీఎంపై గులకరాయి వేస్తే పోలీసులంతా హడావుడి చేశారని, అంతర్వేది రథంలో దోషులను మాత్రం గుర్తించడానికి ఖాళీ లేకుండా పోయిందన్నారు. నర్సాపురం-సఖినేటిపల్లి మధ్య వశిష్ట గోదావరి వంతెన నిర్మాణానికి, కోనసీమలో రైలు కూత వినిపించడానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాజోలు, పి.గన్నవరం, అమలాపురం తీర ప్రాంతాల్లో కేరళ, రాజస్థాన్ తరహా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఒక సెంటు భూమి ఇవ్వలేని వైసీపీ నాయకులు ఉన్నారని, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాత్రం కత్తిమండలో ఐదెకరాల్లో పెద్ద భవనం నిర్మించుకున్నారని ఆరోపించారు. రాజోలు ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్, పార్లమెంటు అభ్యర్థి హరీష్‌మాధుర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.అంతకు ముందు పవన్ ర్యాలీతో మలికిపురం రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. వారాహిపై అభ్యర్థులు గంటి హరీష్‌మాధుర్, దేవవరప్రసాద్‌లతో పాటు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎమ్మెల్యే వేమా, లింగోలు పెద్దబ్బులు, ఎంపీపీలు కేతా శ్రీను, ఎంవీ సత్యవాణి, తాడి మోహన్, దిరిశాల బాలాజీ, గెడ్డం మహాలక్ష్మిప్రసాద్, గుండుబోగుల పెదకాపు, వనమాలి మూలాస్వామి ఉన్నారు.