పది సంవత్సరాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు నిరూపిస్తే కరీంనగర్ ఎంపీ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తప్పుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పది లక్షల ఆరోగ్యశ్రీ అందిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. వచ్చే వర్షాకాలం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని, ఆగస్టులో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్ని హామీలు అమలు చేశామో చూసుకోవాలని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని, రైతుల ఆదాయం రెట్టింపు చేశారా అని ఆయన ప్రశ్నించారు. దేవుడి ఫొటో పెట్టుకుని, రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నారని మంత్రి పొన్నం దుయ్యబట్టారు.