తిరుపతి జిల్లాలో ఎన్నికల వేళ మద్యం డంప్ కలకలంరేపింది. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని పాకాల మండలంలో భారీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంటపల్లి నుంచి యల్లంపల్లి వెళ్లే మార్గంలో ఓ ఇటుకల బట్టీ దగ్గర మద్యాన్ని పోలీసులు గుర్తించారు. ఐషర్ మినీ లారీలో మద్యం ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ మొత్తం 200-300 వరకు మద్యం కేసులున్నట్లు గుర్తించారు. ఇటుక బట్టీల పక్కనే ఉన్న షెడ్‌లోనూ కూడా భారీగా మద్యాన్ని గుర్తించినట్లు సమాచారం. ఆ ఇటక బట్టీలో పనిచేసే ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ నేతలు అక్కడికి వెళ్లారు.. బాధ్యులు ఎవరో తేల్చి కేసులు నమోద చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం కూడా చంద్రగిరి మండలం పుల్లిత్తివారిపల్లిలో కూడా పాత పంచాయతీ భవనంలో దాచిన మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. కొద్దిరోజులుగా రాత్రి సమయంలో అక్కడ కొందరు మద్యం తాగుతున్నట్లు టీడీపీ నేతలు గుర్తించి ఫ్లయింగ్ స్క్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదుతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.. అక్కడ 3 కేసుల్లోని 141మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే స్థానిక సర్పంచ్ భర్త అంజాద్ 8 నెలలుగా సచివాలయ తాళాలు ఇవ్వలేదని గ్రామ కార్యదర్శి చెబుతున్నారు. ఇలా వరుసగా మద్యం దొరకడం కలకలంరేపింది.