ప్రకృతి ప్రకోపానికి పపువా న్యూగినియా చిగురుటాకులా వణికిపోతోంది. కొండచరియలు విరిగిపడి 2 వేల మందికిపైగా సజీవ సమాధి అయ్యారని ఆ దేశ విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర పపువా న్యూగినియాలోని పర్వత ప్రాంతం ఎంగా రీజియన్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ గా కొండచరియలు విరిగిపడటంతో గ్రామానికి గ్రామం నేలమట్టమైంది. తొలుత ఈ సంఖ్య 600గా ఉంటుందని అంచనా వేసినా.. ప్రస్తుతం 2 వేల దాటేసింది. భారీగా నీటి ప్రవాహం, మట్టి కోతకు గురవడంతో సహాయకచర్యలకు ప్రమాదకరంగా మారింది.
భారీ వర్షాలు కారణంగా ఈ విపత్తు సంభవించింది. ఆ ప్రాంతంలో దాదాపు 4,000 మంది నివస్తుండగా.. సగం కంటే ఎక్కువ మంది చనిపోయారు. ప్రాణాలతో ఉన్నవారికి కట్టుబట్టలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. ప్రజలకు జీవనాధారమైన తోటలు తుడిచిపెట్టుకుపోయాయి. తాగేందుకు నీళ్లు కూడా దొరకడం లేదు. శిథిలాల నుంచి ఎవరూ సజీవంగా బయటపడే అవకాశం లేదని అధికారులు తెలిపారు. శవాలను వెలికితీసేందుకు స్థానికులు పారలు, గడ్డపారలతో మట్టిని తవ్వుతున్నారు. ప్రధాన రహదారులు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ప్రమాదం జరిగిన వెంటనే 100 మంది చనిపోయినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. తర్వాత ఈ సంఖ్య 670కి చేరినట్టు తెలిపింది. కానీ, చివరకు మృతుల సంఖ్య భారీగా పెరిగింది.‘కొండచరియలు విరిగిపడి 2000 మందికి పైగా ప్రజలు సజీవ సమాధి అయ్యారు.. భవనాలు, ఆహార తోటలు తుడిచిపెట్టుకుపోయాయి.. దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపింది’ అని పపువా న్యూగినియా నేషనల్ డిజాస్టర్ సెంటర్ డైరెక్టర్ లుసేటే లాసో మనా తెలిపారు.
పరిస్థితి ఇంకా దారుణంగానే ఉందని, కొండ చరియలు ఇంకా విరిగి పడుతూనే ఉన్నాయి.. దీని వల్ల రెస్క్యూ టీమ్‌లు, ప్రాణాలతో బయటపడిన వారికి ప్రమాదకం పొంచి ఉంది.. విపత్తు నిర్వహణ బృందం నిర్వహించిన పరిశీలన ప్రకారం నష్టాలు విస్తృతంగా ఉన్నాయి.. ఈ విషయంలో తక్షణం అందరి సహకారం అవసరమని నిర్ధారించాం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొండచరియలు విరిగిపడి 150కిపై ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.