బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను ఆదివారం అర్దరాత్రి తర్వాత పశ్చిమ్ బెంగాల్‌కు సమీపంలోని బంగ్లాదేవ్ వద్ద తీరాన్ని తాకింది. తీవ్ర తుఫానుగా తీరం దాటడంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ గాలులు వీయడంతో ఎక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. కోల్‌కతా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, బిధాన్‌నగర్, బీర్బూమ్, నాడియా, బంకురా, తూర్పు బుర్ద్వాన్, తూర్పు మేదినీపూర్ సహా బెంగాల్‌లోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. చెట్లు రోడ్లపై నేలకూలగా.. విద్యుత్ స్తంభాలు కూలి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కోల్‌కతాకు ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తీరం దాటిన రెమల్ తుఫాను.. గత ఆరు గంటలుగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. తీరం దాటిన తర్వాత రెమల్ తుఫానుగా బలహీపడింది. క్రమంగా సాయంత్రానికి మరింత బలహీనపడి వాయుగండంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. మంగళవారం ఉదయం వరకూ వాయుగుండంగా కొనసాగి.. మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీపనడుతుందని తెలిపింది.
ఇక, తుఫాను ప్రభావంతో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల 135 కి.మీ. వేగంతో గాలులు వీచాయని ఐఎండీ పేర్కొంది. బెంగాల్‌లోని లోతట్టు ప్రాంతాల్లోని లక్షమందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. నేవీకి చెందిన రెండు నౌకల్లో సహాయక సామాగ్రి, మెడికల్ కిట్‌లను సిద్ధం చేశారు. తుఫాను కారణంగా కోల్‌కతా విమానాశ్రయాన్ని 21 గంటల పాటు మూసివేశారు. కొన్ని ప్రాంతాల్లో మెట్రో సేవలను కూడా నిలిపివేశారు. సోమవారం జరగాల్సిన పరీక్షలను పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు రద్దు చేసి.. మరో తేదీకి వాయిదా వేశాయి. అటు, రెమల్ తుఫానుతో బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోల్‌కతా నగరంలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.