పుణేలో గతవారం జరిగిన పోర్షే కారు ప్రమాద ఘటన అచ్చం సినిమాను తలపిస్తోంది. తప్పతాగి కారు నడిపిన టీనేజర్.. ఇద్దరు టెకీలు మరణానికి కారణమయ్యాడు. ఈ కేసులో కొడుకు నేరాన్ని కప్పిపుచ్చడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఈ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. మైనర్ బ్లడ్ శాంపిల్స్‌ను వైద్యులు మార్చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సాసూన్ ఆస్పత్రికి చెందిన వైద్యులు అజేయ్ తావ్‌రే, శ్రీహరి హార్నూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ విభాగం చీఫ్‌గా పనిచేస్తోన్న తావ్‌రే.. మైనర్ రక్త నమూనాల్లో ఎటువంటి ఆల్కహాల్ ఆనవాలు లేవని నివేదిక ఇచ్చారు.
కానీ, విచారణలో అతడు మద్యం సేవించినట్టు తేలింది. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా మిత్రులతో కలిసి అతడు మద్యం తాగినట్లు నిర్దారించారు. దీంతో వైద్యులు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు ధ్రువీకరించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యులు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్ డేటాను పరిశీలించారు. ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడి తండ్రి.. వారితో ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించామని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముమ్మర దర్యాప్తు సాగుతోంది. పుణే కమిషనర్ అమితేష్ కుమార్ మాట్లాడుతూ ‘ఇదేదో మద్యం మత్తులో చేసిన ప్రమాదం కేసు ఎంత మాత్రం కాదు. నిందితుడైన టీనేజర్‌కు రెండు బార్లలో పార్టీ చేసుకొంటూ మద్యం సేవించిన విషయం స్పష్టంగా తెలుసు.. అలాంటి పరిస్థితుల్లో వాహనం నడిపితే ప్రాణాలకు రోడ్డుపై వెళ్లేవారి ప్రాణాలకు ప్రమాదమన్న విషయంపై అతడికి పూర్తి అవగాహన కూడా ఉంది.. ప్రమాదం జరిగిన తర్వాత నిందితుడి రక్త నమూనాలను వివిధ సందర్భాల్లో పరీక్షించడంతో కచ్చితమైన ఫలితాలు వచ్చాయి. ’’ అని పేర్కొన్నారు.
పోలీస్ వర్గాల ప్రకారం.. ‘మొదటి రక్త నమూనాల్లో మద్యం సేవించిన ఆనవాళ్లు లేవని నివేదిక వచ్చింది.. రెండో ఫలితంలో మాత్రం పాజిటివ్ రావడంతో అనుమానం వచ్చి డీఎన్ఐ టెస్ట్ చేశారు.. ఈ పరీక్షలో వేర్వేరు వ్యక్తుల నమూనాలు ఉన్నట్టు వెల్లడయ్యింది.. అంటే మైనర్ రక్త నమూనా మరొక వ్యక్తితో మార్చేశారు.. నివేదికలొ ఆల్కహాల్ గురించి ప్రస్తావించలేదు.’ అని తెలిపాయి.
గత ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అశ్విని కోస్టా, అనీశ్ అవధీయలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో బాలుడికి జువైనల్ జస్టిస్ట్ బోర్డు కొద్ది గంటల్లో బెయిల్ మంజూరు చేసింది. ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. కానీ, కోర్టు తీర్పుపై తీవ్ర విమర్శలు రావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డ్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. బాలుడిని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించాలని ఆదేశించింది. నిందితుడి తండ్రి, రెండు బార్‌ల సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ కేసును తప్పుదోవ పట్టించి, మైనర్‌ను రక్షించేందుకు అతడి కుటుంబం ప్రయత్నించి, అబాసుపాలయ్యింది.
డ్రైవర్‌ను ఈ కేసులో ఇరికించేందుకు అతడ్ని బంధించి, బెదిరించారు. అంతేకాదు.. కొందరు పోలీసులను ప్రభావితం చేసినట్లు ఆరోపణలు రావడంతో వారిపై అధికారులపై వేటువేశారు. ఇప్పుడు తాజాగా ఫోరెన్సిక్ పరీక్షలు చేసే వైద్యులు కూడా రక్తనమూనాలను తారుమారు చేయడానికి యత్నించినట్లు తేలడం ఆందోళనకరంగా మారింది.