రాష్ట్రంలో టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. యథేచ్ఛగా విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నాయి. వాహనాలను ధ్వంసం చేస్తున్నాయి. మంగళవారం మొదలుపెట్టిన ఈ అరాచకపర్వాన్ని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు బుధవారం కూడా కొనసాగించారు. ఈ రెండురోజులు ప్రభుత్వ భవనాల వద్ద ఫలకాలను చిత్రపటాలను ధ్వంసం చేస్తూ స్వైరవిహారం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహానేత వైయస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేసి, విగ్రహాల వద్ద కూటమి జెండాలు ఏర్పాటు చేశారు. ఇప్పటంలో ప్రజల భాగస్వామ్యంతో నిర్మించిన దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ భవనం పైభాగంలో జనసేన, టీడీపీ జెండాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పేరును తొలగించారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో 1, 2 సచివాలయాల వద్ద వైఎస్ జగన్ డిజిటల్ బోర్డులను తొలగించి రోడ్డుపై పడవేసి చిత్రపటంపై రాళ్లు వేశారు. నూతన సచివాలయం శిలాఫలకంలో ఉన్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాన్ని చిన్నపిల్లలతో పగులగొట్టించారు. రైతుభరోసా కేంద్రంపై నవరత్నాల బోర్డును ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా గోళ్ళపాడులో వైయస్ఆర్ విలేజ్ క్లినిక్ శిలాఫలకాన్ని పగులగొట్టారు. తిరుపతి జిల్లా పుత్తూరులో పలు ఆలయాల వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాలను బుధవారం సాయంత్రం తెలుగుదేశం నాయకులు ధ్వంసం చేశారు. శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయం లోపల ఏర్పాటు చేసిన అన్నదాన, కళ్యాణోత్సవ మండప శిలాఫలకాన్ని, ఆరేటమ్మ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనుల పేరిట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, గేట్పుత్తూరులోని గోవిందమ్మ ఆలయం వద్ద ప్రారంభించిన జగనన్న సమావేశమందిర శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం నాయకులు డి.జి.ధనపాల్, బి.శ్రీనివాసులు చేసిన ఈ విధ్వంసంపై పుత్తూరు సెంగుంధర్ మక్కల్ నల సంఘం ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు ఎస్.ఎన్.గోపిరమణ, టి.జి.శక్తివేలు, ఎం.ఎస్.తిరునావక్కర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని యలమంచిపాడులో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త షేక్ మస్తాన్‌పై టీడీపీ నాయకులు దాడిచేశారు. అడ్డుకోబోయిన ఆయన తల్లి షేక్ బీబీ తలపైకొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆమెను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తడకలూరులో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త యలమా వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. మరికొన్ని గ్రామాల్లో కూడా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. గ్రామాల్లో వివాదాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa