భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు (జూన్ 9న) ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్ల జరుగుతున్నాయి.ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నిపర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. ఇక, రేపు మూడోసారి దేశ ప్రధానిగా మోడీ రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి 7. 15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఇక, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సార్క్ (సౌత్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఫర్ రీజినల్ కో-ఆపరేషన్) దేశాల అతిథులను ఆహ్వానించారు. అలాగే, ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అతిథులు హోటల్‌కు వెళ్లే మార్గం పూర్తిగా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇదే కాకుండా పొరుగు దేశాలైన భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్ దేశాల నేతలు మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు.కాగా, ఈ అతిథులందరి భద్రత కోసం తాజ్, లీలా, ఐటీసీ మౌర్య, క్లారిడ్జ్ లాంటి లగ్జరీ హోటళ్లను ఇప్పటికే భద్రత అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఢిల్లీలో జరగనున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవ భద్రతకు సంబంధించి పారామిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులతో పాటు NSG, SWAT కమాండోలు రాష్ట్రపతి భవన్‌తో పాటు పలు కీలక ప్రదేశాల చుట్టూ భారీగా మోహరించారు. నేషనల్ డెమోక్రటిక్ ( ఎన్డీయే) అలయన్స్ పార్లమెంటరీ పార్టీ తన నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత జూన్ 7వ తేదీన రాష్ట్రపతి ముర్ము నరేంద్ర మోడీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధికారికంగా కోరారు.