సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సామాన్యుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికమంది ఫ్యాన్‌కు ఓటేస్తే.. కూటమి అభ్యర్థికి ఎలా పడ్డాయంటూ గ్రామాల్లోని రచ్చబండలపై చర్చ జోరుగా సాగుతోంది. కొన్ని గ్రామాల్లో శతశాతం వైయస్ఆర్‌సీపీ అభిమానులు ఉన్న చోట కూడా సైకిల్ గుర్తుకు వందల్లో ఓట్లు రావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా ఎలా సాధ్యమైందంటూ ఆయా గ్రామాల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఓ పట్టణంలో ప్రజలు ఏకంగా బ్యానర్ కట్టి తమ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు. బిడ్డా ..మేమంతా నీకే ఓట్లు వేశామయ్య.. మా ఓట్లు ఏమయ్యాయి.. ఎన్నికల్లో కుట్ర జరిగింది..మళ్లీ 2029లో కలుద్దామని వైయస్ జగన్‌కు బహిరంగంగా మద్దతు తెలుపుతూ తమ మనసులో మాటను బ్యానర్ రూపంలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎన్నికల నిర్వాహణపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఏర్పాటు చేసుకున్న బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరమూ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తే.. కూటమి అభ్యర్థులకు మెజార్టీ ఎలా వచ్చిందంటూ నాయకులు, ప్రజలు ఓ చోటకు చేరి తర్కిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు ఓటువేసేందుకు వెళ్లే సమయంలో పోలింగ్ కేంద్రంలో ఏమైనా మతలబు జరిగిందా? లేదంటే ఈవీఎంలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న సందేహం వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనా ఫలితాలు భిన్నంగా ఉన్నాయని, ఓటర్లు ఓ వైపు ఉంటే.. ఓట్లు మరోవైపు పడ్డాయని, దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికల కమిషన్ దృష్టిసారిస్తే నిజాలు బయటకు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.