స్నేహితులతో సముద్ర స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం , వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెం గ్రామానికి చెందిన అలిగి రాజేష్ (33) విశాఖ జిల్లా మధురవాడలో పని చేస్తుంటాడు. ఇతడికి భార్య లావణ్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామానికి వచ్చిన రాజేష్.. ఆదివారం తిరిగి విశాఖ వెళ్లేందుకు బయలుదేరాడు. మధ్యాహ్నం 1.30 సమయంలో ఊరెళ్తానని చెప్పి భార్య లావణ్య వద్ద రూ.200 తీసుకున్నాడు. ఇంతలో స్నేహితులతో కలిసి కుందువానిపేట సముద్ర తీరానికి వెళ్లాడు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రాజేష్ స్నానానికి సముద్రంలో దిగి లోతట్టు ప్రాంతానికి వెళ్లాడు. ఒక్కసారిగా అలల తాకిడి పెరగడంతో అతడు సముద్రంలో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామానికి చెందిన లొట్టి రమేష్, జనార్దన్కు విషయం తెలియడంతో వారు గ్రామస్థులతో కలిసి రాజేష్ కోసం గాళింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో భార్య లావణ్య రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా. ఎస్ఐ వాసుదేవరావు ఆధ్వర్యంలో గాలిస్తున్నారు.