రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. అనంతపురం జిల్లా విజిలెన్స్ , ఎన్ఫోర్స్‌మెంట్ అధికారిగా ఉన్న మునిరామయ్య అనే పోలీస్ అధికారి విచారణ రిపోర్ట్‌ను పరిగణలోకి తీసుకోవాలని సీఐడీకి లేఖ రాశారు. గతంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాసుదేవరెడ్డి చేపట్టిన కొన్ని అవకతవకలపై వివరణ కోరుతూ దర్యాప్తు అధికారి ముని రామయ్య షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. వాసుదేవ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చిన దర్యాప్తు అధికారి ముని రామయ్యపై విజిలెన్స్‌పై అధికారి కొల్లి రఘురామిరెడ్డి నిప్పులు గక్కారన్నారు. వాసుదేవరెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చిన మునిరామయ్యను వెంటనే డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయమని కొల్లి రఘురామరెడ్డి ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎండీ వాసుదేవరెడ్డిపై విచారణ చేసిన పాపానికి 09/02/2024 నుంచి జీతభత్యాలు లేకుండా దర్యాప్తు అధికారి మునిరామయ్య వీఆర్‌లో ఉన్నారని చెప్పారు. అవినీతి అధికారులను శిక్షించకపోగా... వారిపై విచారణ చేసిన పోలీసు అధికారులను శిక్షించడం ఏమిటని గత ప్రభుత్వంపై వర్ల రామయ్య నిప్పులు చెరిగారు. సీఐడీ డీజీ ధర్మవరం, తాడిపత్రి, అనంతపురంలలో వాక్ ఇన్ లిక్కర్ షాపుల్లో అవినీతికి పాల్పడ్డ వాసుదేవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు.