తాగునీరు కలుషితం కావడంతో ఆ నీరు తాగిన దళిత కాలనీవాసులు వాంతులు, విరోచనాలకు గురై ఆసుపత్రి పాలైన ఘటన శుక్రవారం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేశానుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో రెండు బోర్ల నుంచి కాలనీవాసులు తాగునీటికి, ఇతర అవసరాలకు నీటిని వాడుతుంటారు. గత నాలుగు రోజులుగా కాలనీలో వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి చెందిన వినుకొండ కోటయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా వుండటంతో గుంటూరు తరలించారు. కాలనీలో పదవ తరగతి చదువుతున్న శ్రీపతి మెర్సీ, 6వ తరగతి చదువుతున్న మీసాల మౌనిక, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పమ్మి లక్ష్మీ, వింజమూరి కమలమ్మ, వంగూరి నాగమ్మ, వినుకొండ రత్నబాబు, పేరుపోగు జగన్, వుల్లేరు లింగమ్మ, శ్రీపతి భాస్కరరావుతో పాటు దాచేపల్లిలోని అచ్చాలగడ్డలో నివశిస్తున్న యాదలపురం వెంకట నర్సమ్మ, కుమ్మరిబజారులో నివశిస్తున్న మరో ఇద్దరు వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. గ్రామంలో కాలనీవాసులంతా కాయకష్టం చేసుకొని జీవనం సాగించే వారు. వీరంతా డయేరియాకు గురై ఆసుపత్రిపాలవడంతో పేదకుటుంబాలకు చెందిన వీరంతా అవస్థలు ఎదుర్కొంటున్నారు.