ఎన్నికల్లో వైసీపీ ఓటమిచెందింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే, అన్ని శాఖల్నీ ప్రక్షాళన చేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు విషయంపై దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర నిధుల్ని గత ప్రభుత్వం మళ్లించడంపై ఆగ్రహించారు. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా మళ్లిస్తుందని, స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి సమగ్ర నివేదికను అందించాలని సూచించారు. దీంతో ఆర్థిక సంఘం నిధులపై సర్పంచులకు ఆశలు పెరిగాయి. ఇక నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని అయినా, కూటమి ప్రభుత్వం పంచాయతీ ఖాతాలకు జమ చేస్తుందన్న ఆశావహంతో ఉన్నారు. తద్వారా గ్రామ పంచాయతీలకు మళ్లీ పూర్వ వైభవం రానుందని భావిస్తున్నారు.