ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఉరుకులు పరుగులు తీయిస్తున్నారు. ఇక శనివారం అసెంబ్లీకి వచ్చిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా అసెంబ్లీలో ప్రసంగించారు. స్పీకర్ ఎన్నిక తర్వాత అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి పవన్ మాట్లాడారు. ఆ తర్వాత ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యాలయంలోకి వెళ్తూ జనవాణి కేంద్రంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను చూసిన డిప్యూటీ సీఎం.. కాన్వాయి ఆపి వారితో ముచ్చటించారు. రోడ్డుపైనే కుర్చివేసుకుని వారి బాధలు విన్నారు. ఈ క్రమంలోనే భీమవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె కనిపించడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తెను.. ప్రేమ పేరుతో ట్రాప్ చేశారని వాపోయింది. మైనర్ అయిన తన కూతురు గడిచిన తొమ్మిది నెలలుగా కనిపించడం లేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. తన కూతురు కనిపించకుండా పోయిన విషయమై మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని.. పోలీసులకు తమ కూతురు జాడ తెలిసినా కూడా పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ వద్ద మొరపెట్టుకుంది.
దీంతో ఆ మహిళ బాధను పూర్తిగా విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మిస్సింగ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించారు. ఆ వెంటనే మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. మిస్సింగ్ కేసు మీద చర్యలకు పవన్ ఆదేశించారు. అనంతరం పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించారు. ఈ కేసుతో పాటు జనవాణి కార్యక్రమంలో బాధలు చెప్పుకునేందుకు వచ్చిన పలువురు సమస్యలను పవన్ సావధానంగా విన్నారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు.