మాజీ సీఎం జగన్‌కు కనీసం సభ మర్యాద కూడా లేదని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను ఎప్పుడు చూడలేదని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. స్పీకర్ ఎన్నిక సమయంలో విపక్షం ఉండటం అనేది సభా సాంప్రదాయమని తెలిపారు. నిన్న వారి పార్టీ నేతలకు కూడా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కేశవ్ కూడా చెప్పారని గుర్తుచేశారు. అయినా ఈ రోజు జగన్, వారి ఎమ్మెల్యేలు రాకపోవడం అతనికి సభ పట్ల ఏం మర్యాద ఉందనేది తెలుస్తుందని అన్నారు. అందుకనే ప్రజలు అతని స్థానం ఏమిటో చూపించారన్నారు. సభకు వచ్చి సంప్రదాయాలను గౌరవించి, ప్రజా సమస్యలను లేవనెత్తి మాట్లాడితే అతనికే మంచిదన్నారు. తాము మాత్రం సభా గౌరవాన్ని పెంచి చూపుతామని పునరుద్ఘాటించారు. ఇది కౌరవ సభ కాదు... సభకు హుందాతనం ఉందని తెలిపారు. కానీ గత సభలో వాళ్లు కౌరవుల్లా వ్యవహరించారని మండిపడ్డారు.